
పందొమ్మిదో శతాబ్దం మధ్యలో ఈ భూభాగాన్ని టర్కిష్ ఆటోమన్ సామ్రాజ్యం నుంచి ఈజిప్ట్ కైవసం చేసుకుంది. కొద్ది సంవత్సరాలలోనే బ్రిటన్ జోక్యం చేసుకుని ఈ ప్రాంతాన్ని మళ్లీ ఆటోమన్ సామ్రాజ్యంలో చేర్చింది గాని అది ప్రధానంగా బ్రిటిష్ సామ్రాజ్య ప్రభావంలోనే ఉండింది.
ఈ లోగా 1897లో థియొడర్ హెర్జెల్ అనే యూదు సిద్ధాంత కర్త జియోనిజం అనే సిద్ధాంతాన్ని ప్రవచించాడు. ఆ సిద్ధాంతం బైబిల్ లోని బుక్ ఆఫ్ జెనెసిస్ లో ఈ ప్రాంతాన్ని అబ్రహాం వారసులకు ఇస్తున్నట్టుగా భగవంతుడు చెప్పాడని, దానిపేరు ఇజ్రాయెల్ అని, తాము అబ్రహాం వారసులమని, అందువల్ల ఇది తమకు చెందాలని వాదించడం మొదలుపెట్టింది. ఈ జియోనిజం ప్రారంభకులూ, సమర్థకులూ ప్రధానంగా యూదులు. వడ్డీ వ్యాపారులుగా, వర్తకులుగా, సంపన్నులుగా యూదుల పట్ల అప్పటికి మూడు నాలుగు వందల ఏళ్లుగా యూరప్ లో ఉండిన వ్యతిరేక భావనల వల్ల యూదులను ఏకం చేసి, వారికే ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచడం జియోనిజం లక్ష్యం. ఇది భగవంతుడి ఆదేశంగా మాత్రమే కాక, “భూమిలేని ప్రజలకు, ప్రజలు లేని భూమి” అనే నినాదాన్ని కూడ తీసుకుంది. కాని పాలస్తీనా ప్రజలు లేని భూమి కాదు, అక్కడ నిండా అరబ్బులు ఉన్నారు.
మత విశ్వాసాల ప్రకారం పాలస్తీనా జనాభా అప్పటికి పూర్తిగా ముస్లింలు కాగా ఇది యూదు – ముస్లిం మత వైరంగా కూడ బలపడింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్న యూదులైనా ఈ తమ మాతృభూమికి వెళ్లి స్థిరపడాలని అంటూ భారీ వలసలను ఈ జియోనిజం ప్రోత్సహించింది. మొదటి ప్రపంచయుద్ధం సమయంలో వెలువడిన బాల్ ఫోర్ డిక్లరేషన్ తో ఈ నినాదం ప్రచారంలోకి రాగా బ్రిటన్ ఈ జియోనిస్టు వలసలను పూర్తిగా సమర్థించింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి పాలస్తీనా భూభాగమంతా బ్రిటన్ చేజిక్కింది. పాలస్తీనీయులు బ్రిటన్ కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించినప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసేవరకూ పాలస్తీనా బ్రిటన్ చేతిలోనే ఉండిపోయింది.
చివరికి 1947లో పాలస్తీనా మీద తన అధికారం వదులుకుంటున్నానని ప్రకటించిన బ్రిటన్, అప్పటికే బలపడిన అమెరికాలు ఐక్యరాజ్యసమితి చేత ఒక తీర్మానం చేయించాయి. ఆ తీర్మానం ప్రకారం పాలస్తీనాను మూడు భాగాలుగా విడగొట్టారు. ఒకటి అరబ్ రాజ్యం, ఒకటి యూదుల రాజ్యం. మరొకటి అంతర్జాతీయ సంస్థల అదుపులో ఉండే జెరూసలెం నగరం. అరబ్బుల నేలలో ఉన్న, తనకు అత్యంత అవసరమైన చమురు కోసం వారితో తనకు ఎప్పటికైనా ఘర్షణ తప్పదని, విభిన్న మతవిశ్వాసాల వల్ల ఆ ఘర్షణ సమసిపోవడం సాధ్యం కాదని గుర్తించిన అమెరికా అరబ్బు దేశాల పక్కలో బల్లెంలా ఇజ్రాయెల్ ను తయారుచేసి, దాన్ని తన కీలుబొమ్మగా మార్చుకోవాలని చేసిన దురాలోచన ఫలితమే యూదుల రాజ్యంగా ఇజ్రాయెల్ ఏర్పాటు.
ఈ విభజనను వ్యతిరేకించిన అరబ్బులు యుద్ధం ప్రారంభించారు. అయినా ఇజ్రాయెల్ ఏర్పాటు కావడం మాత్రమే కాదు, ఐరాస తీర్మానంలో లేని మరొక 26 శాతం భూభాగం మీద కూడ ఇజ్రాయెల్ తన పాలన స్థాపించుకుంది. ఆ ప్రాంతం నుంచి పారిపోయిన ఏడు లక్షల మంది పాలస్తీనీయులు శాశ్వతంగా శరణార్థులయిపోయారు. ఈ యుద్ధంలో పాలస్తీనాలో కొంత భాగం జోర్డాన్ చేతికీ, కొంత భాగం ఈజిప్ట్ చేతికీ వెళ్లాయి. 1967లో జరిగిన మరొక యుద్ధంలో ఈ రెండు దేశాల నుంచి పాలస్తీనా భాభాగాల్ని ఇజ్రాయెల్ కైవసం చేసుకుంది.
రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో, ముఖ్యంగా యూరప్ లో నాజీ హిట్లర్ అత్యాచారాలకు బలి అయిన యూదులు శరణార్థులుగా ఈ ప్రాంతానికి వలస రావడం ప్రారంభించారు. నిజానికి హిట్లర్ దుర్మార్గాలను తప్పించుకోవడానికి వలస వచ్చిన ఈ శరణార్థుల వలసలను మానవతా దృష్టితో సమర్థించవలసిందే గాని, వారు పాలస్తీనాలో స్థానికులను తోసివేసి, స్థానికుల భూమిని ఆక్రమించుకుని, వారినే శరణార్థులుగా మార్చివేశారు.
పాలస్తీనాను దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసి స్వతంత్ర రాజ్యం ఏర్పరచాలనే లక్ష్యంతో 1964లో ఏర్పడిన పాలస్తీనా విమోచన సంస్థ (పి ఎల్ ఒ) యాసర్ అరాఫత్ నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవాదరాలు సంపాదించుకుంది. వంద దేశాలు పి ఎల్ ఒ ను గుర్తించాయి. ఐక్యరాజ్యసమితి పిఎల్ ఒ ను గుర్తించింది. అమెరికా, ఇజ్రాయెల్ లు మాత్రం దాన్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఈ రాజకీయ, అర్థ సైనిక జాతీయ విమోచనా సంస్థ పాలస్తీనా విముక్తి కోసం రాజకీయ, దౌత్యపరమైన పోరాటం చేస్తూనే సాయుధ పోరాటాన్ని కూడ చేపట్టింది. ఆ సాయుధ పోరాటాలు అనేక మలుపులు తిరిగాయి.
ఐక్య రాజ్య సమితిలో ఇజ్రాయెల్ దురాక్రమణ కు వ్యతిరేకంగా, పాలస్తీనా ప్రజల న్యాయమైన పోరాటానికి మద్దతుగా జరిగిన తీర్మానాలకు లెక్కలేదు. ఆ తీర్మానాల అమలు ప్రసక్తి వచ్చేసరికి అమెరికా, బ్రిటన్ లు వీటో ప్రకటించి అడ్డుకునేవి. సుదీర్ఘకాలం ఘర్షణల తర్వాత 1993లో పి ఎల్ ఒ కు ఇజ్రాయెల్ కు మధ్య నార్వే లోని ఓస్లోలో శాంతి ఒప్పందం కుదిరింది. పి ఎల్ ఒ సాయుధ పోరాటాన్ని విరమించి, ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని గుర్తించింది. ఇందుకు ప్రతిగా పాలస్తీనీయులకు గాజా నగరంలో, వెస్ట్ బ్యాంక్ లో, జెరికోలో పరిమిత స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అంటే ఒక దేశపు పౌరులను అణచివేసి, నిర్వాసితులను చేసి, వారి మీద నాలుగు దశాబ్దాలకు పైగా యుద్ధం చేసి, చివరికి వారి దేశంలో పదో వంతు భూభాగం మీద వారికి పరిమిత స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారన్నమాట. పాలస్తీనాకు సంపూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ పి ఎల్ ఒ నాయకత్వాన మరొక సాయుధ పోరాటం జరగడంతోపాటు పి ఎల్ ఒ రాజీని వ్యతిరేకించే సంస్థలెన్నో పుట్టుకువచ్చాయి. అటువంటి సంస్థలలో ఒకటైన హమస్ గాజా నగరంలో అధికారానికి కూడ వచ్చింది.
ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చి, తమ నేల మీద తమ పాలన నడుపుకుంటున్న హమస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి, పాలస్తీనియన్లకు మిగిలిన ఆ నేలచెక్కను కూడ కబళించడానికి, పాలస్తీనియన్లను బెదిరించడానికి ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర కుటిల ప్రయత్నాలలో భాగమే తాజా బాంబుదాడులు.
