ఎలక్షన్ కోడ్ క్రమశిక్షణ సంబందించి నాకు తెలిసిన కొన్ని ప్రశ్నలు వాటి సమాదానాలు:
సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు మార్గదర్శక ప్రవర్తనా నియమావళి
ప్రశ్న: 2. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఎన్నికల సంఘం పాత్ర ఏమిటి?
జవాబు: భారత రాజ్యాంగం 324 ప్రకారం పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లిలకు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా ఎన్నికల్ని నిర్వహించడంలో తన రాజ్యాంగపరమైన విధుల్ని నిర్వర్తించేందుకు ఎన్నికల సంఘం కేంద్రంలోను, రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న రాజకీయపక్షాలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సాక్షిగా ప్రయత్నిస్తుంది. ఎన్నికల ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగం దుర్వినియోగానికి గురికాకుండా అది నియంత్రిస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఓటర్లని ప్రభావితం చేయడం, వారికి లంచాల్ని చూపి ప్రలోభపెట్టడం, వారిని భయపెట్టడం, అవమానించడం వంటి నేరాలు, అక్రమాలు, లంచగొండి కార్యకలాపాలు జరగకుండా అన్ని విధాలా నిరోధిస్తుంది. నియమ నిబంధనల్ని ఉల్లంఘిస్తే తగుచర్యలు తీసుకుంటుంది.
ప్రశ్న: 3. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు మార్గదర్శక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది?
జవాబు: ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించిన తారీఖు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుంది.
ప్రశ్న: 4. సాధరణ ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ఈ ప్రవర్తనా నియమావళి ఎంత వరకు వర్తిస్తుంది?
జవాబు: ఎ. లోక్‌సభకు జరిగే సాధారణ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి దేశవ్యాప్తంగా అమల్లో ఉంటుంది.
బి. విధాన సభకు జరిగే సాధారణ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉంటుంది.
సి. ఉప ఎన్నికల సమయంలో ఉప ఎన్నికలు జరిగే నియోజక వర్గం ఏ జిల్లా లేదా జిల్లాలలో ఉంటుందో ఆ జిల్లా అంతటా అమల్లో ఉంటుంది.
ప్రశ్న: 5. మార్గదర్శక ప్రవర్తనా నియమావళి లోని ముఖ్యమైన అంశాలేమిటి?
జవాబు: ప్రవర్తనా నియమావళి రాజకీయ పార్టీలు, అధికార పక్షాలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలో ఎలా ప్రవర్తించాలో చెబుతుంది. అంటే, ఎన్నికల్లో వారి ప్రవర్తనా సరళి, సభలు, సమావేశాలు, ప్రదర్శనల్ని నిర్వహించే తీరుతెన్నులన్నింటికీ సంబంధించి ఇది నియమావళిని వివరిస్తుంది.అధికార యంత్రాంగానికి సంబంధించి...
ప్రశ్న: 6. ఒక మంత్రి తన అధికార పర్యటనను, ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మిళితం చేయవచ్చునా?
జవాబు: మంత్రులు తమ అధికార పర్యటనల్ని, ఎన్నికల ప్రచారానికి కలపకూడదు. అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని ఎన్నికల ప్రచారం కోసం వాడుకోరాదు.
ప్రశ్న: 7. ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రభుత్వ రవాణా సౌకర్యాల్ని వాడుకోవచ్చునా?
జవాబు: వీల్లేదు,అధికార వైమానిక సౌకర్యాల్ని, వాహనాల్ని వాడుకోరాదు. ఏ పార్టీ లేదా అభ్యర్థి ప్రయోజనం కోసం వీటిని వాడనే కూడదు.
ప్రశ్న: 8. ఎన్నికల ప్రక్రియ నిమిత్తం ప్రభుత్వం అధికారుల్ని బదిలీ చేయడం, నియామకాలు జరపడం వంటివి చేయవచ్చునా?
జవాబు: ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ అధికారుల బదిలీ/ నియామకాలపై పూర్తి స్థాయి నిషేధం అమల్లో ఉంటుంది. ఏ అధికారి బదిలీ లేదా నియామకం అవసరమైన పక్షంలో ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతినిపొందాలి.
ప్రశ్న: 9. మార్గదర్శక ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే ఒకవేళ ఒక అధికారిని ఎన్నికల ప్రక్రియ నిమిత్తం ప్రభుత్వం బదిలీ చేసినట్టయితే, ఆ అధికారి నూతన పదవీ బాధ్యతల్ని స్వీకరించనట్టయితే, ప్రవర్తనా నియమావళిని ప్రకటించిన తరువాత అతను పదవీ బాధ్యతల్ని స్వీకరించవచ్చునా?
జవాబు: యధాతథ స్థితి కొనసాగుతుంది.
ప్రశ్న:10. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక అయిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రులు పాల్గొనవచ్చునా?
జవాబు: వీల్లేదు. ప్రభుత్వ నిధుల్ని వినియోగించి జరిపే అలాంటి వేడుకల్లో ముఖ్యమంత్రి కానీ, మరే ఇతర మంత్రులు కానీ పాల్గొనరాదు. ఆ వేడుకల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులు మాత్రమే పాల్గొనాలి.
ప్రశ్న: 11. ఎన్నికల సమయంలో ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రావతరణ దినోత్సవాల్లో ముఖ్యమంత్రి/మంత్రి/స్పీకర్ పాల్గొనవచ్చునా?
జవాబు: ఆ సందర్భంగా అతను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యల్ని చేయని పక్షంలో, ఆ వేడుకను ప్రభుత్వాధికారులే నిర్వహిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి/మంత్రి/స్పీకర్ అలాంటి వేడుకల్లో పాల్గొనడంపై ఎలాంటి అభ్యంతరమూ లేదు.
ప్రశ్న: 12. ఎన్నికలు జరుగుతున్నపుడు ఏదైనా విద్యా సంస్థకు, విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్నాతకోత్సవంలో గవర్నర్/ముఖ్యమంత్రి/మంత్రులు పాల్గొనవచ్చునా?
జవాబు: స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొనవచ్చు, ప్రసంగించవచ్చు. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం స్నాతకోత్సవంలో పాల్గొనరాదన్న సూచన ఉంది.
ప్రశ్న: 13. సంబంధిత ఖర్చుల్ని ప్రభుత్వ ఖజానా భరిస్తూ 'ఇఫ్తార్ విందు' లేదా అలాంటి విందు కార్యక్రమాల్ని రాజకీయ ప్రముఖుల నివాసాల్లో ఏర్పాటు చేయవచ్చునా?
జవాబు: వీల్లేదు. కానీ ఏ వ్యక్తికి అయినా తన వ్యక్తిగత సామర్థ్యాన్ని అనుసరించి, సొంత ఖర్చులతో వ్యక్తిగతంగా అలాంటి విందుల్ని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది.
ప్రశ్న: 14. రాష్ట్ర అసెంబ్లిdలో బడ్జెట్ సెషన్‌ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడంపై ఎలాంటి ఆంక్షలైనా ఉన్నాయా?
జవాబు: లేవు.
ప్రశ్న 15: ఎన్నికల సంఘం నుంచి ప్రత్యక్షంగా రాష్ట్రప్రభుత్వం ఏదైనా ప్రతిపాదనకు సంబంధించి వివరణను/ఆమోదాన్ని కోరవచ్చునా?
జవాబు: ఇలాంటి ఏదైనా ప్రతిపాదనకు సంబంధించిన అభ్యర్థనను రాష్ట్రప్రభుత్వం ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా మాత్రమే పంపాలి. ఆయనే దీనికి సంబంధించి సిఫారసు చేయడం లేదా మరో విధంగా ప్రతిస్పందించడం
వంటివి చేస్తాడు. ఎన్నికల ప్రచారం
ప్రశ్న 16: ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు/ అభ్యర్థులకు వర్తించే ప్రధాన మార్గదర్శక సూత్రాలేమిటి?
జవాబు: ఎన్నికల ప్రచార సమయంలో ఏ పార్టీ లేదా అభ్యర్థి కుల, మత, భాషా పరమైన విభిన్న సమూహాల మధ్య ఇదివరకే ఉన్న పరస్పర వైషమ్యాల్ని రెచ్చగొట్టేలా, లేదా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడరాదు. ఇతర పార్టీల గురించిన విమర్శలు కేవలం ఆ పార్టీల గత ప్రవర్తన, విధానాలకు, కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి. ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తల, నాయకుల, వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విమర్శలకు పార్టీలు, అభ్యర్థులు దూరంగా ఉండాలి. ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలపై ఆధారరహితమైన ఆరోపణలు, విమర్శలు చేయకూడదు.
ప్రశ్న 17: మతపరమైన ప్రదేశాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవడానికి సంబంధించి ఏవైనా ఆంక్షలు ఉన్నాయా?
జవాబు: ఉన్నాయి. గుడి, మసీదు, చర్చి, గురుద్వారా, లేదా ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికలుగా ఉపయోగించుకోరాదు. అంతేగాక ఓట్ల కోసం మతాన్ని లేదా కులాన్ని కించపరిచే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టకూడదు.
ప్రశ్న 18: ఒక అభ్యర్థి నామినేషన్‌ను దాఖలు చేయడానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తన మద్దతుదారులతో ప్రదర్శనగా వెళ్లవచ్చునా?
జవాబు: వీల్లేదు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఆవరణలో వందకిలోమీటర్ల పరిధిలో మూడుకు మించి వాహనాల్ని నిలపడానికి వీల్లేదు. అలాగే కార్యాలయంలోకి ప్రవేశించే వ్యక్తుల సంఖ్య మీద కూడా పరిమితి ఉంది. అభ్యర్థితో సహా ఐదుగురు మాత్రమే ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ప్రవేశించాలి.
ప్రశ్న 19: రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాల పరిశీలనకు ఉపక్రమించిన సమయంలో అక్కడ ఎంతమంది వ్యక్తులకు అనుమతి ఉంటుంది?
జవాబు: అభ్యర్థితోపాటు అతని తరఫు ఎన్నికల ఏజెంట్, నామినేషన్‌ను బలపరిచే వ్యక్తి, మరో వ్యక్తి (ఇతను న్యాయవాది అయి ఉండవచ్చు) మాత్రమే అభ్యర్థి రాతపూర్వక అభ్యర్థన ప్రకారం రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాల పరిశీలనకు ఉపక్రమించిన సమయంలో అక్కడ ఉండడానికి అర్హులు. మరే ఇతర వ్యక్తీ ఆ సమయంలో అక్కడ ఉండకూడదు.
ప్రజాప్రతినిధుల చట్టం 1951, సెక్షన్ 36 (1)ని పరిశీలించండి